నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పుడు చందాదారుల పెన్షన్ కార్పస్ ఫండ్ ఐదు లక్షల రూపాయల వరకు ఉంటే.. ఆ మొత్తం డబ్బును ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు లబ్ధిదారులు తమ ఎన్‌పిఎస్ ఖాతా నుంచి రెండు లక్షల రూపాయల వరకూ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిమితి దాటిపోయిన తర్వాత, పెన్షనర్లు తమ కాంట్రిబూషన్‌లో 60 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.
అంటే, ప్రస్తుతమున్న నియమం ప్రకారం, కనీసం 40శాతం విరాళాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం ఆమోదించిన యాన్యుటీల్లో ఉంచాలి. ఈ నిబంధనలను కేంద్రం సడలించింది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ప్రభుత్వం ద్వారా నడిచే పెట్టుబడి పథకం. ఇది చందాదారులకు ఒక ఆప్షన్ ఇస్తుంది. ఇందులో వేర్వేరు అసెట్ క్లాజ్‌లకు తాము ఇష్టపడే కేటాయింపును సెట్ చేసుకునే అవకాశం చందాదారునికి ఉంటుంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ రెండు రకాల ఖాతాలను ఆఫర్ చేస్తుంది. అవి టైర్-1, టైర్-2 అకౌంట్లు. ప్రభుత్వ బాండ్లు, ఈక్విటీ మార్కెట్, కార్పొరేట్ రుణాలతో పాటు ఈ రెండు రకాల ఖాతాలను ఆఫర్ చేస్తుంది.
ఇందులో టైర్-1 ఎన్‌పిఎస్ అకౌంట్... కచ్చితంగా పెన్షన్ అకౌంట్‌గా ఉంటుంది. ఇక టైర్-2 అకౌంట్‌ను పెట్టుబడి అకౌంట్‌గా పిలుస్తారు. ఇది శాశ్వత పదవీ విరమణ అకౌంట్ నెంబర్‌తో (PRAN) అనుసంధానమై ఉండే స్వచ్ఛంద పొదుపు ఖాతా.
ప్రస్తుతం పెట్టుబడిదారులు మూడేళ్లు పూర్తయిన తర్వాత మాత్రమే ముందస్తుగా డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంలో విత్‌డ్రా చేసుకునే మొత్తం చందాదారులు చేసిన కాంట్రిబూషన్‌లో 25 శాతాన్ని మించకూడదు. ఇక్కడ విత్‌డ్రాలకు పేర్కొన్న కారణాలకు అనుగుణంగానే అనుమతిస్తారు. పిల్లల ఉన్నత చదువుల కోసం, వారి పెళ్లికి, ఇల్లు కొనుగోలు చేయడానికి.. లేదంటే ఇల్లు నిర్మించుకోడానికి (నిర్దేశించిన పరిస్థితుల్లో), క్లిష్టమైన అనారోగ్యాలకు చికిత్స చేయించుకోవడానికి ఈ అనుమతి ఉంటుంది.
Post a Comment